Manmohan Singh: అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాన మంత్రి..! 9 d ago
భారత మాజీ ప్రధాన మంత్రి.. దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. గురువారం రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. రాత్రి 8.30 గంటల సమయంలో అత్యవసర వార్డులో చేరిన ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 9.51 గంటల సమయంలో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటివద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని, ఆసుపత్రికి వచ్చాక తీవ్రంగా ప్రయత్నించినా కాపాడలేకపోయామని ఎయిమ్స్ బులెటిన్ వెల్లడించింది.
మన్మోహన్ సింగ్ కు భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్న మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ప్రధానిగా పదేళ్లు సేవలందించారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకూ ప్రధానిగా పని చేశారు. 33 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన, అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. 1987లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.
ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా..1991లో ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యారు. వారిద్దరూ కలిసి దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక చిదంబరంతో కలిసి ఆర్థిక రంగాన్ని ముందుకు ఉరికించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలపనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఏడు రోజులపాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది.